Posts

Showing posts from May, 2021

VISWAWAGURU

  VISWAWAGURU   విశ్వగురు డానీ   అధ్యాయం - 1   కరోనా ఫంగస్ లా నల్లగా వుంది రోడ్డు. వేసవి ఎండ తెల్లటి వెండిలా మెరుస్తోంది. లాక్ డౌన్ యుగం గాబట్టి రోడ్డు మీద నరసంచారం లేదు. కనుచూపు మేర   దట్టంగా   పెరిగిన చెట్లు అడవిని తలపిస్తున్నాయి. కొన్ని యుగాల పూర్వం అడవుల్ని నరికి నాగరీకతను నిర్మించారట. నాగరీకత అంతరించిపోవడంతో ఈ యుగంలో నేలంతా అడవులు పెరిగిపోయాయి. నగరాల్లోనూ పగలు రాత్రి పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి.     రోడ్డుకు ఇరువైపులా   రెండు భారీ సైనికుల ఉక్కు విగ్రహాలున్నాయి. కొలమానాలన్నీ మారిపోయాయి కనుక ఆవిగ్రహాల ఎత్తు ఎంతో చెప్పడం కష్టం. వాటి పాదాలకున్న ఇనప బూట్లు   మనిషి ఎత్తుకు రెట్టింపు వున్నాయి. నల్లగా తారుపూసినట్టున్న   ఆ విగ్రహాల నీడ మూడు నాలుగు తాడి చెట్ల పొడవున నేల మీద పరచుకున్నాయి.   రోడ్డుకు దక్షణ దిక్కున వున్న   అడవి నుండి ఒక తొండ బయటికి వచ్చింది.   తలను అటూ ఇటూ ఆడించి పరుగున రోడ్డు దాటి ఉత్తర దిక్కున వున్న పొదల్లోనికి    జారుకుంది.     అంత చిన్న జీవి చేసిన టపటప చప్పుడు కూడ ఆ ప్రాంతపు గాలిలో కాస్సేపు ప్రకంపనలు   సృష్టించింది.